తెలంగాణ ఉనికిని తక్కువ చేయొద్దు: వేణు ఊడుగుల

October 25, 2026


img

వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, నాగదుర్గ జంట చేస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ఇటీవల ‘గడప’ పాట విడుదలైంది. దానిలో పెళ్ళి విందులో నీళ్ళకు బదులు మద్యం గ్లాసులు పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. 

తెలంగాణ పెళ్ళిళ్ళలో విందు, మందు కామన్ కానీ తెలంగాణ అంటే తాగుడే అన్నట్లు సినిమాలో చూపడం సరికాదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేణు ఊడుగుల స్పందిస్తూ వారికి గట్టి సమాధానమిచ్చారు.

ఒక సమాజపు సంస్కృతిని వారు ఉపయోగించే పళ్లెంలో, గ్లాసుల్లో వెతకకూడదని, వారి చరిత్ర, శ్రమ, కళలు, పోరాటాల్లో చూడాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను కించపరచడం సులభమేనని, కానీ ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కారంతో పాటు అధ్యయనం అవసరమని అన్నారు.

ప్రజల జీవితాలను, సంస్కృతిని సహజంగా తెరపైకి తీసుకొచ్చే ‘ఇడుపు కాయితం’ వంటి సినిమాలను ఆదరించాలని కోరారు. సినిమా విడుదలయ్యాక నచ్చకపోతే విమర్శించవచ్చని, అంతేకానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని అజ్ఞానంతో నిర్వచించవద్దని స్పష్టం చేశారు.

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష