తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి

October 27, 2026


img

తెలంగాణ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.  

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లడంతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.శామ్ కోషి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయనను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది. 

కనుక అయన స్థానంలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ తపబ్రత చక్రవర్తి పేరు సిఫార్సు చేసింది. 

జస్టిస్ తపబ్రత చక్రవర్తి 1967లో కోల్‌కతాలో న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసిన అనంతరం 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 

సుమారు 22 ఏళ్లపాటు కలకత్తా హైకోర్టులో పని చేశారు. 2013 అక్టోబర్ 30న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

కొలీజియం చేసిన తాజా సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత నియామకాలు అధికారికంగా అమల్లోకి వస్తాయి.


Related Post