కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు

September 29, 2026


img

మాజీ మంత్రి కొండా సురేఖ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం, అందుకు మూల్యం చెల్లిస్తుండటం పరిపాటే.

ఆమె కుమార్తె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నప్పుడు, వెంటనే ఆమె వాటిని ఖండించి కుమార్తె తరపున క్షమాపణలు చెప్పి ఉంటే మంత్రి పదవి ఉండేది.

కానీ కుమార్తె మాటలతో నాకేం సంబంధం అంటూ ఆమె మాటలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లు మాట్లాడి మంత్రి పదవి పోగొట్టుకున్నారు.

తాజాగా కొండా సురేఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దానిలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, ఆనాడు ఆ విధంగా మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేశారు.

అప్పటి రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలోనే వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ దానిలో పేర్కొన్నారు.

కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించాలని తనకు ఉద్దేశం లేదని తెలిపారు.

ఆమె కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో కొండా దంపతులు తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే, రేవంత్ రెడ్డి, కేటీఆర్ లేదా మరొకరిపై ఆ స్థాయిలో నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఎవరిని బాధ పెట్టడానికి కాదని ఆమె చెప్పినంత మాత్రాన ఆమె మాట్లాడిన ఆ మాటలు ఎవరు మర్చిపోలేరు. అవి వెనక్కి తీసుకోవడం కూడా సాధ్యం కాదు.

కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు కనుక దానికి భయపడే ఆమె క్షమాపణలు కోరారా? లేక బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికే క్షమాపణలు చెప్పారా? అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.


Related Post