మార్కెట్లో ప్రసిద్దమైన బ్రాండెడ్ బియ్యం ప్యాకెట్లు లభిస్తున్నాయి. అవైతే నాణ్యంగా, రుచిగా ఉంటుందని ప్రజలు చాలా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే అవన్నీ నిజంగా బ్రాండెడ్ బియ్యం కావు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని కొందరు దళారులు, రైస్ మిల్లర్లు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత వాటిని రైస్ మిల్లుల్లో పాలిష్ చేయిస్తున్నారు. ఆ బియ్యన్నే వివిధ బ్రాండ్ల పేర్లతో ఉన్న సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
పౌరసరఫర అధికారులు చేసిన తాజా దాడులలో ఓ కొత్త మోసం వెలుగు చూసింది. వారు తెలిపిన సమాచారం ప్రకారం లబ్ధిదారుల నుంచి దళారులు కిలో రూ.15-18 వరకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో పాలిష్ చేసి, ప్యాకింగ్ చేసిన తర్వాత అదే బియ్యాన్ని కిలో రూ.60-80 వరకు అమ్ముకుంటున్నారు.
దీని కోసం గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని, బియ్యం సేకరించి ఎవరికీ అనుమానం కలుగకుండా ఆటోలలో రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ ప్రభుత్వం 2025 ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల తెల్ల రేషన్ కార్డులకు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.
ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.14,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రభుత్వం సదుద్దేశ్యంతో ప్రారంభించిన ఈ పధకాన్ని దళారులు ఈవిధంగా తెలివిగా ఉపయోగించుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మంగళపల్లి, బొంగుళూరు, శంషాబాద్, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో ఈ ఏడాది 8,000 క్వింటాళ్ళకు పైగా పీడీఎస్ సన్న బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళపల్లిలోని ఓ రైస్ మిల్లులో 396 క్వింటాళ్ళు, కరీంనగర్లో 307 క్వింటాళ్ళు స్వాధీనం చేసుకున్నారు.