తెలంగాణ ప్రజలకు దసరా పండుగ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నవంబర్ నుంచి కరెంటు బిల్లుల్లో ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) నిర్ణయించింది. దీంతో వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నెలవారీ బిల్లులు భారీగా పెరగనున్నాయి.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.7, 635.22 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలను టీజీఈఆర్‌సీ అనుమతించింది.
ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కనుక మిగిలిన రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్ భారాన్ని వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేయబోతున్నాయి.
నవంబర్ బిల్లుల్లో యూనిట్‌కు 30 పైసల చొప్పున, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేయనున్నారు.
అంటే 100 యూనిట్లు వినియోగించే కుటుంబానికి నవంబర్‌లో రూ.30, ఆ తర్వాత నెల నుంచి రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. బిల్లులో ట్రూ-అప్ ఛార్జీని సాధారణ విద్యుత్ చార్జీలతో కలపకుండా ప్రత్యేకంగా చూపించాలని టీజీఈఆర్‌సీ ఆదేశించింది. అలాగే ట్రూ-అప్‌కు సంబంధించి పూర్తి వివరాలు తప్పనిసరిగా విద్యుత్ బిల్లులలో పేర్కొనాలని ఆదేశించింది.
ఇంతకీ ఈ ట్రూ-అప్ ఛార్జీలు బాదుడు దేనికంటే, డిస్కంలు ముందుగా అంచనా వేసిన విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు వ్యయం కంటే, వాస్తవ ఖర్చు ఎక్కువైనప్పుడు ఆ తేడాను వినియోగదారుల నుంచి వసూలు చేయడాన్నే ట్రూ-అప్ అంటారు. అంటే ఇప్పుడు పడుతున్న ఈ భారం కొత్తగా పెంచిన విద్యుత్ టారిఫ్ కాకుండా.. గత ఖర్చుల సర్దుబాటు అన్నమాట.