2015 నాటి ఓటుకు నోటు కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తున్న ఈ కేసులో తన వాదనలు కూడా వినిపించేందుకు అనుమతించాలని మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. .
ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసును ఏ చట్టం కింద నమోదు చేయాలన్న అంశంతో పాటు కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ వారు పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్ల విచారణ సమయంలోనే స్టీఫెన్‌సన్ తన వాదనలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
స్టీఫెన్‌సన్ తరఫు న్యాయవాది సోమవారం ఈ పిటిషన్ వేశారు. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా, బాధితుడిగా ఉన్న స్టీఫెన్‌సన్ వాదనలు వినడం అవసరమని కోర్టుకు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఆయనను కేసులో ఇంప్లీడ్ చేసేందుకు అనుమతించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
దీంతో ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లకే పరిమితమైన విచారణలో స్టీఫెన్‌సన్ వాదనలు కూడా కీలకంగా మారనున్నాయి.