హైదరాబాద్ నడిబొడ్డున గల కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో కీలక మార్పులు చేసింది. మొదట చేసిన ప్రతిపాదనలను సమూలంగా మార్చేసి, ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీలకు టెండర్ సొమ్ము వాపసు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ కూడలి వరకు నిర్మించాలనుకున్న రెండు వరుసల ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది. అలాగే టీవీ9 జంక్షన్ వద్ద ప్రతిపాదించిన రెండు వరుసల అండర్ పాస్ రోడ్, మూడు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణాలను కూడా నిలిపివేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆత్యవసరమైన పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. .
కనుక జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు కొత్త ప్రణాళిక రూపొందించింది.
గతంలో మొత్తం ప్రాజెక్టుకు రూ.1,090 కోట్ల అంచనా వ్యయం ఉండగా, సవరించిన ప్రతిపాదనలో రూ.715.16 కోట్లతో పూర్తిచేయబోతోంది.
మొదటి దశలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముగ్ధ కూడలి వరకు రూ.365.85 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. రెండో దశలో అక్కడి నుంచి ముఫకంజా కళాశాల వరకు రూ.349.31 కోట్లతో బ్రిడ్జ్ నిర్మించడంతో పాటు బంజారాహిల్స్ రోడ్డు నంబర్-1కు అనుసంధానంగా మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో ఈ మార్పులకు ఆమోదం లభించింది. తదుపరి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపించనున్నారు. సవరించిన అంచనాలతో ఈ రెండు దశల పనులను ఎంఈఐఎల్ సంస్థకు అప్పగించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.