హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు (కేబీఆర్ పార్కు)లో ప్రతి ఏడాది అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలను నిర్వహిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
కనుక ఈ ఏడాది కూడా అట్టహాసంగా ఈ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున పార్కు చరిత్ర, ప్రాధాన్యత, నిర్వాహకులు ప్రజలకు వివరిస్తారు. నేడు పార్కులో నివసిస్తున్న వివిధ పక్షులు, వాటి ఆహారపు అలవాట్ల గురించి నిపుణులు వివరించి సామాన్య ప్రజలు వాటిని గుర్తించేలా చేస్తారు.
రేపు మూడో రోజున పార్కులో విస్తరించి ఉన్న వివిధ వృక్ష జాతులు, పొదలు, వాటి ఔషద గుణాలు, వాటిలో నివసించే కీటకాలు వగైరాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇలా పార్కుకు సంబంధించి రోజుకొక కొత్త విషయాలు సందర్శకులకు వివరిస్తూ, పర్యావరణం, ప్రకృతి, వీటిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న జీవరాశి గురించి అందరికీ అవగాహనా కల్పిస్తారు.
వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిన్న వయసు నుంచే పిల్లలలో ప్రకృతి, జీవవైవిధ్యంపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.