కేసీఆర్ మాట్లాడక, కేటీఆర్ అతిగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని చెప్పక తప్పదు. కేటీఆర్‌కు హైదరాబాద్‌లో మూడు స్టార్ హోటల్స్ ఉన్న సంగతి సిఎం రేవంత్ రెడ్డి బయట పెట్టినప్పుడు, అది తెలంగాణ సమాజానికి పెద్ద షాక్‌లా తగిలింది.
కేటీఆర్‌కు హైదరాబాద్‌లోనే మూడు స్టార్ హోటల్స్‌లో ఉన్నాయనే సంగతి రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి తెలిసి ఉండవచ్చు. కానీ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు, బీఆర్ఎస్, బిజేపి, కాంగ్రెస్ పార్టీలలో దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలకు తెలిసే అవకాశం తక్కువ.
కనుక నిత్యం ఆ హోటల్స్ ముందు నుంచే రాకపోకలు సాగించేవారు, ఇప్పుడు ఓసారి వాటి ముందు ఆగి చూసి వెళ్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నష్ట నివారణ ప్రయత్నించబోయి మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఆయన మెడకే చుట్టుకున్నాయి.
సోషల్ మీడియాలో కేటీఆర్‌పై జరుగుతున్న ట్రోలింగ్ పక్కన పెడితే, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన సూటి ప్రశ్న ప్రజలను ఆలోచింపజేస్తుంది.
ఆయనేమన్నారంటే, “అమెరికాలో 5-6 ఏళ్ళు పనిచేసిన వచ్చిన కేటీఆర్ హైదరాబాద్‌లో స్టార్ హోటల్ కట్టుకున్నానని చెప్పుకున్నారు. కానీ అమెరికాలో గత 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు నేటికీ హైదరాబాద్‌లో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. ఇన్ని ఆస్తులు సంపాదించుకోలేకపోతున్నారు! వారికి సాధ్యం కానిది నీకెలా సాధ్యపడింది?” అని ప్రశ్నించారు.
“నేను ఒక్క హోటల్ పెడితే అది మూడు హోటల్స్ అయ్యాయి. అదే నేను వాటిపైనే దృష్టి పెడితే మరో పది హోటల్స్ అయ్యుండేవి,” అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా చామల స్పందిస్తూ, “ఒక్క హోటల్ పెట్టి దానిని పది హోటల్స్ చేయగల తెలివితేటలున్న నువ్వు, పదేళ్ళు మంత్రిగా పనిచేశావు కదా? నీ తెలివి తేటలతో తెలంగాణను మరింత ధనిక రాష్ట్రంగా మార్చాలి కదా?
కానీ ధనిక రాష్ట్రంగా మీ చేతికి వచ్చిన తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా ఎందుకు చేశావు?నీ వ్యాపారాలను మూడింతలు అభివృద్ధి చేసుకోగలవు. కానీ నీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తావా? ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెడితే ఇలా చేస్తారా?” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.