రేవంత్, మోడీ పాటలను బీఆర్ఎస్‌ పార్టీ అంగీకరించగలదా?

September 27, 2026


img

వినాయక చవితి మండపాల వద్ద, నిమజ్జన ఊరేగింపులలో డీజేలు, రాజకీయ పార్టీల పాటలు పెట్టవద్దని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ చెబితే, దానినీ బీఆర్ఎస్‌ పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ, “పోలీసుల పనేమిటి? శాంతిభద్రతలు కాపాడటం. ఎక్కడా అవాంచనీయ ఘటనలు జరుగకుండా భద్రత ఏర్పాటు చేయడం. కానీ మన కమీషనర్‌ ఏమంటున్నారు? మండపాలు, ఊరేగింపులలో కేసీఆర్‌ పాటలు పెట్టరాదని చెప్తున్నారు. మండపాలలో ఏం పాటలు పెట్టుకొవాలో ఆయనే చెప్తారా? కానీ అయన అంత చెప్పినా ఈ పిల్లలు ఆయన ముందే డీజే దానిలో కేసీఆర్‌ పాటలు పెట్టుకొని డాన్సులు చేశారు. తెలంగాణలో గడ్డి పరక కూడా గడ్డ పారగా మారుతుందని నిరూపించి చూపారు, “ అని కేటీఆర్‌ మెచ్చుకున్నారు.

పూజా మండపాల వరకు రాజకీయాలను వ్యాపింపజేస్తే జరిగేది అరాచకమే. ఒక పార్టీ నాయకుడి పాటలు పెడితే, వెంటనే మరొకరు మరో పార్టీ నాయకుడి పాటలు పెట్టకుండా ఉంటారా? అప్పుడు వారి మద్య ఘర్షణలు జరిగితే అందరూ పోలీసులనే నిందిస్తారు కదా? 

ఒకవేళ రేపు బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు మండపాల వద్ద ఇలాగే రేవంత్ రెడ్డి లేదా మోడీ కాంగ్రెస్‌ లేదా బిజేపి పాటలు పెట్టి ఇలాగే డాన్సులు చేస్తామంటే సహిస్తుందా? అనుమతిస్తుందా?

మంత్రిగా చేసిన కేటీఆర్‌ వంటివారే నగర పోలీస్ కమీషనర్‌ పట్ల ఇంత చులకనగా, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తినే విధంగా మాట్లాడటం సబబేనా? రాజకీయ నాయకులు పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశ్యించి ఇంత చులకనగా మాట్లాడుతుంటే సమాజంలో అరాచక శక్తులు పోలీసులకు భయపడతాయా?


Related Post