బీఆర్ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ 22ఏ అస్త్ర ప్రయోగం..

September 25, 2026


img

తెలంగాణ శాసనసభ సమావేశాలతో మొదలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆదిపత్యపోరు సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. 

బీఆర్ఎస్‌ పార్టీ 22ఏ భూముల వ్యవహారంతో అధికార పార్టీని ఇరుకున పెట్టబోతే, కాంగ్రెస్‌ ప్రభుత్వం దానినే అస్త్రంగా బీఆర్ఎస్‌ పార్టీపై ప్రయోగించడం విశేషం.     

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులతో సహా బీఆర్ఎస్‌ ముఖ్య నేతలు, పలువురు మాజీ మంత్రులు, తాజా, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు సంబంధించిన భూములపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో ఓ హై లెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఏ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా, రిజిస్ట్రేషన్స్‌, స్టాంప్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, సంబంధిత జిల్లాలకు చెందిన కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

కమిటీ విచారణ చేయబోయే వాటిలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు చెందిన ఎర్రవల్లి, మార్కుక్‌, శివారు వెంకటాపూర్‌ ప్రాంతాల భూములు, కేటీఆర్‌ కుటుంబానికి సంబంధించిన జన్వాడ భూములు, హరీశ్‌రావు కుటుంబానికి సంబంధించిన రామంచ భూములు ఉన్నాయి. 

అలాగే మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన భూములపైనా పరిశీలన జరగనుంది.

ప్రభుత్వ, అసైన్డ్‌, సీలింగ్‌ సర్‌ప్లస్‌, భూదాన్‌, ఇనాం, అటవీ భూములు, చెరువులు, భూ రికార్డులకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలించనుంది. దీంతో 22ఏ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయ ఆరోపణల నుంచి అధికారిక విచారణ దశకు చేరింది.


Related Post