తెలంగాణ హైకోర్టు ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ అయన సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి హైకోర్టు తీర్పుని సమర్ధించింది. ఆయన పిటిషన్ కొట్టివేసింది.
కనుక దానం నాగేందర్‌కు మిగిలిన ఈ చివరి అవకాశం కూడా పోయినట్లే. అనర్హత వేటు పడినందున నిబంధనల ప్రకారం ఆరేళ్ళపాటు ఏ ఎన్నికలలో అయన పోటీ చేయలేరు. కనుక కుటుంబ సభ్యులు ఎవరినైనా బరిలో దించుతారేమో?
పార్టీ మారిన మిగిలిన తొమ్మిది మంది అనర్హత వేటు పడకుండా తప్పించుకోగా, దానం నాగేందర్ ఒక్కరే ఎందుకు ఇలా దొరికిపోయారో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ టికెట్ మీద 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం.
దానం నాగేందర్ సీటు ఖాళీ అయినట్లు హైకోర్టు ప్రకటనని సుప్రీంకోర్టు కూడా సమర్ధించడంతో ఆరు నెలల్లోగా ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.