వరంగల్‌ విమానాశ్రయం పేరు: ఓవైసీ సూచన

September 23, 2026


img

త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న వరంగల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తగిన పేరు సూచించాల్సిందిగా సిఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రజలు, వివిధ రంగాలకు చెందినా ప్రముఖులు అనేక పేర్లు సూచిస్తున్నారు.

మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా ఓ పేరు సూచిస్తూ సిఎం రేవంత్‌ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. ఆయన స్వాతంత్ర్య సమారా యోధుడు ‘మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్’ పేరు పెట్టమని విజ్ఞప్తి చేశారు. 

ఆ లేఖలో అయన గురించి, మామునూరు విమానాశ్రయం చరిత్ర గురించి కొన్ని వివరాలు తెలియజేశారు. 

దేశంలో అతిపురాతన విమానాశ్రయాలలో మామునూరు విమానాశ్రయం  కూడా ఒకటి. అజాం జాహి మిల్స్‌తో వరంగల్‌ పరిసర ప్రాంతాలలో గల అనేక పరిశ్రమలు ఉన్నందున రాకపోకల కోసం దీనిని 1930లో హైదరాబాద్‌ నిజాం నవాబు నిర్మించారు.  

హైదరాబాద్‌లో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1857 జూలై 17న తిరుగుబాటు జరిగింది. దానిలో అప్పటి ఉమ్మడి వరంగల్‌కు చెందిన ‘మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్’ తుర్రెబాజ్‌ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడికి నాయకత్వం వహించారు. 

ఇందుకుగాను బ్రిటిష్‌ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి సెల్యులార్‌ జైలులో నిర్బంధించారు. నాటి తొలి దశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇటువంటి అనేక మందికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు.

కనుక నాటి ఈ స్వాతంత్ర్య సమరయోధుడి గౌరవార్ధం వరంగల్‌ విమానాశ్రయానికి ‘మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్ విమానాశ్రయం’ అని పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా భావితరాలకు మన స్వాతంత్ర్య సమరయోధులు గురించి తెలుస్తుందని అసదుద్దీన్‌ ఓవైసీ లేఖలో పేర్కొన్నారు.       



Related Post