ఎర్రవల్లిలో ఆక్రమణలు జరిగాయా లేదా?

September 19, 2026


img

సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం మేరకు సిద్ధిపేట జిల్లా రెవెన్యూ సిబ్బంది నేడు మూడో రోజున జిల్లాలోని మర్కుక్ మండలంలో సర్వే చేస్తున్నారు.

ఎర్రవల్లిలోని మాజీ సిఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని సర్వే నంబర్ 325లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు భావిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు రెవెన్యూ శాఖకు చెందిన ఐదు ప్రత్యేక బృందాలు సర్వే చేస్తున్నాయి.

ఈరోజు సాయంత్రంలోగా సర్వే పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. ఈలోగా మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి పాత రికార్డులను వెలికి తీసి పరిశీలిస్తున్నారు.

ఆ రికార్డులో వివరాలు, తాజా సర్వే నివేదికను పోల్చి చూసి ఆ భూములను గుర్తించబోతున్నారు. ఈ భూములపై జిల్లా స్థాయిలో నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దాని ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

కేసీఆర్‌ అధీనంలో ఈ భూములున్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక బడుగు బలహీనవర్గాలకు చెందిన ఒక్కో  కుటుంబానికి అర ఎకరం చొప్పున పంచిపెడతామని ఇటీవల ఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. 

కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌసులో ఒక్క గజం కూడా ఆక్రమిత స్థలం లేదని, ఉందని నిరూపిస్తే బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని, లేకుంటే సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు రాజీనామా చేస్తారా? అని హరీష్‌ రావు సవాలు విసిరారు. 

కనుక ఈ తాజా సర్వే చాలా కీలకంగా మారింది. సర్వే నివేదిక ఏవిధంగా ఉంటుందో వచ్చే వారంలో తెలియవచ్చు. 


Related Post