నిజామాబాద్‌లో పట్టపగలు దారుణహత్య!

September 18, 2026
img

నిజామాబాద్‌లో గురువారం పట్టపగలు దారుణహత్య జరిగింది. ప్రముఖ యూట్యూబర్‌ వైష్ణవి ఇటీవల భర్త చిత్తారి హరిబాబు చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనిని వైష్ణవి చిన్నాన్న కుమారుడు గంధం సంతోష్ హత్య చేశాడు. 

నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు పట్టణంలో రాజరాజేంద్ర నగర్‌ చౌరస్తా వద్ద ఓ దుకాణం వద్ద హరిబాబు ఉన్నప్పుడు, అక్కడకు కారులో వచ్చిన గంధం సంతోష్ పలుమార్లు కత్తితో పొడిచి అదే కారులో పారిపోయాడు. ఈ ఘటన సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. అయితే పోలీసులకు శ్రమ లేకుండా తానే హరిబాబుని హత్య చేశానంటూ సంతోష్ గురువారం రాత్రి ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశాడు. 

తన చెల్లిని చంపిన హరిబాబుకి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఆశించానని, కానీ అతను మూడు నెలల్లోనే బెయిల్‌పై  బయటకు వచ్చేయడం చూసి తన గుండెలు రగిలిపోయాయని ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. 

కనుక తన చెల్లిని హత్య చేసిన హరిబాబుని తానే చంపేసి చెల్లికి న్యాయం చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. తాను పోలీసులకు లొంగిపోతున్నానని, ప్రజలు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడాలని అదే వీడియోలో అభ్యర్ధించాడు. అనంతరం కోరుట్ల పోలీసులకు సంతోష్ లొంగిపోయాడు.       

యూట్యూబర్‌ వైష్ణవి, హరిబాబు ప్రేమించి పెద్దల అంగీకారంతో 2025లో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత కోరుట్ల మండలంలోని మాదాపూర్‌లో హరిబాబు, అతని తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు. 

అయితే పెళ్ళయిన తర్వాత కూడా వైష్ణవి యూట్యూబ్‌ రీల్స్ చేస్తుండటంతో కుటుంబంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. అందువల్ల వేరే కాపురం పెట్టే విషయంలో ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. దాంతో ఆమె ఈ ఏడాది మార్చిలో పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అప్పటికి ఆమె 5నెలల గర్భిణి. 

మార్చి 17వ తేదీన హరిబాబు అక్కడకు వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేక హరిబాబు ఆమెను హత్య చేశాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపగా మూడు నెలల్లోనే బెయిల్‌పై  విడుదలై బయటకు వచ్చేశాడు. 

దీంతో.. గర్భవతి అయిన తన చెల్లిని హత్య చేసిన బావ హరిబాబుని చంపేయడమే న్యాయమని భావించిన సంతోష్, అతనిని నిన్న మధ్యాహ్నం హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సంతోష్‌ని అరెస్ట్ చేసి నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.  

Related Post