ఐదు నిమిషాలు మాట్లాడనిస్తే చాలు.. రాజీనామా చేసి వెళ్ళిపోతా!

September 16, 2026


img

ఈరోజు శాసనసభ సమావేశంలో ఆర్మూర్‌ బిజేపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పీకర్‌ని ఉద్దేశ్యించి, అధ్యక్షా! నన్ను ఓ ఐదు నిమిషాలు మాట్లాడనిస్తే చెప్పాల్సినవన్నీ చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళిపోతానన్నారు. అది విని అందరూ షాక్ అయ్యారు. కానీ ఆయన చాలా ఆవేదనతో రాజీనామాకు సిద్దపడ్డారు. 

ఇంతకీ ఆయనేమన్నారంటే, “సిఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు దాని పరిధిలో గల పరిగిలో అభివృద్ధి పనులకు వేలకోట్లు మంజూరు చేస్తున్నారు. కానీ నా ఆర్మూర్ నియోజకవర్గంలో కనీసం కొత్తగా ఎంఆర్వో ఆఫీసు కూడా కట్టలేదు. 

సబ్ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి, నిజాం కాలంలో కట్టిన శిధిలావస్థకు చేరుకున్న అలాంటి భవనంలో కూర్చోని పనిచేయాల్సి వస్తోంది. కనుక ఆర్మూర్‌లో సమీకృత కార్యాలయం నిర్మించమని గత రెండేళ్ళుగా రెవెన్యూ మంత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ పట్టించుకోలేదు. 

ఒకప్పుడు నిజాంసాగర్ నీళ్ళతో కళకళలాడిన నిజామాబాద్‌ జిల్లాలో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలకి ఈ రెండున్నరేళ్ళలో ఎన్ని నిధులు కేటాయించుకున్నారో, నిజామాబాద్‌ జిల్లాకు ఎంత విదిలించారో నా దగ్గర లెక్కలున్నాయి. వాటిని చదివి వినిపించేందుకు నన్ను అనుమతిస్తే ఆ తర్వాత నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి వెళ్ళిపోతా. 

నిజామాబాద్‌ జిల్లా అంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు దేనికి?” అని బిజేపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.                 



Related Post