రెండేళ్ళ తర్వాత రేవంత్ పదవిలో ఉండరట!

September 15, 2026


img

ఇటీవల సిఎం రేవంత్‌ రెడ్డి ఓ సభలో ఉపాధ్యాయులను ఉద్దేశ్యించి, “నాకు రెండేళ్ళు సమయం ఇవ్వండి. ఆ లోగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. అవి పరిష్కరించాక ఎన్నికల పరీక్షలను ఎదుర్కొంటా. అప్పుడు నాకు మీరు ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం. ఆ పరీక్షలో నన్ను పాస్ లేదా ఫెయిల్ చేయడం మీ చేతుల్లోనే ఉంది. 

ఒకవేళ నేను మీ సమస్యలను పరిష్కరించానని భావిస్తే పాస్ చేయండి. లేకుంటే నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేయండి. కానీ అంత వరకు నాకు సమయం ఇవ్వండి,” అని అభ్యర్ధించారు. 

ప్రభోత్వోపాధ్యాయుల సమస్యలపై నేడు హైదరాబాద్‌ సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. 

“మాట తప్పడం, మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్. ఎన్నికలప్పుడు అందరికీ చాలా హామీలు ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక హామీలు పక్కన పెట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. 

నాకు మరో రెండేళ్ళు గడువు ఇవ్వాలని సిఎం రేవంత్‌ రెడ్డి కోరారు. ఇప్పటికే మూడేళ్ళు తీసుకున్నారు. ఇలా మరో రెండేళ్ళు కాలక్షేపం చేసేద్దామని అయన ప్లాన్. 

అయితే ఈ రెండేళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ కుర్చీలో ఉండరు. కానీ మేముంటాం. అవుట్ సోర్సింగ్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో కలిపి మొత్తం 13 లక్షల మంది ఉన్నారు. వారందరికీ భరోసా కల్పించేందుకే నేడు ఈ సమావేశం పెట్టుకున్నాము. 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడేందుకు కొన్ని కమిటీలు వేసుకున్నాము. అవసరమైన మరి కొన్ని కమిటీలు వేసుకొని అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మన సమస్యలను పరిష్కరించుకుందాము,” అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి ఇలాగే మాట్లాడేది. మేము అధికారంలోకి వస్తే మంత్రం దండం తిప్పినట్లు సమస్యలన్నీ పరిష్కరించేస్తామని భరోసా ఇచ్చింది. 

కానీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే సగం సొమ్ము, మిగిలిన దానిలో ఉద్యోగుల జీతభత్యాలకు పోగా, అభివృద్ధి పనులకు చేతిలో సొమ్ము ఉండటం లేదని వాదించడం మొదలుపెట్టింది. ఇదే కారణంగా ఉద్యోగుల బకాయిల చెల్లింపు, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. 

ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రతిపక్షంలో ఉన్నారు కనుక హామీల అమలు, ఇలాంటి సమస్యల గురించి నిలదీస్తున్నారు. ఒకవేళ ఆమె సిఎం అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ మారదు. కనుక అప్పుడు ఆమె కూడా ఇలాగే వ్యవహరిస్తారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఆమెను ఇలాగే నిలదీస్తారు. 

కనుక అధికార, ప్రతిపక్షాలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఉద్యోగులు పావులుగా మారకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది.  


Related Post