తిరుమల బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ

September 13, 2026
img

తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం అంకురార్పణ చేసి మర్నాడు ధ్వజారోహణ చేస్తారు. దీని కోసం ఏపీ అటవీశాఖ సిబ్బంది అడవుల నుంచి సేకరించి ‘విష్ణుదర్భ’ను సేకరించి టిటిడీకి అందించగా, దాంతో 22 అడుగుల పొడవు ఏడున్నర అడుగుల వెడల్పు, సుమారు 200 కేజీల బరువున్న చాపను తయారుచేశారు.

అలాగే ఆ దర్భలతోనే 250 మీటర్లు పొడవు, సుమారు 100 కేజీలు బరువున్న తాడును కూడా సిద్ధం చేశారు. ఆలయ ఋత్విక్కులు మంగళవారం వీటిని ధ్వజస్తంభానికి చుట్టిన తర్వాత గరుడ పతాకం ఎగురవేసి స్వామివారి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తారు. సకల దేవతలు అదృశ్యరూపంలో పాల్గొంటారని భక్తుల నమ్మకం. కనుక ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకమైనవి.       

సోమవారం రాత్రి అంకురార్పణ చేసే ముందు సాయంత్రం స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు విగ్రహాన్ని మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఆ తర్వాత రాత్రి యాగశాలలో పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం మాడవీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Related Post