తెలంగాణలో కృత్రిమ పనీర్‌పై నిషేధం

September 12, 2026
img

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ పనీర్‌ తయారీ, విక్రయాలు జోరుగా సాగుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాలు లేకుండా తయారు చేస్తున్న కృత్రిమ పనీ నిషేధం విధించింది. ఈ కృత్రిమ పనీర్‌ తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై సెప్టెంబర్‌ 10 నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

కమిషనర్‌ ఆఫ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006లోని సెక్షన్‌ 30(2)(ఏ) కింద ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పాలతో బదులు వెజిటబుల్‌ ఆయిల్స్‌, ఇండస్ట్రియల్‌ స్టార్చ్‌లతో నకిలీ పనీర్‌ తయారు చేసి చౌకగా అమ్ముతున్నారు. అయితే ఈ విషయం తెలియని సామాన్య ప్రజలతో పాటు హోటల్స్‌, కర్రీ పాయింట్స్, స్వీట్ షాప్స్, బేకరీలలో విస్తృతంగా చౌకగా లభిస్తున్న ఈ పన్నీరు ఉపయోగిస్తున్నాయి.

ఈ నకిలీ పన్నీరు ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిసి ఉన్నప్పటికీ ఫుడ్ ఇండస్ట్రీలో విరివిగా వాడుతున్నట్లు, ఇటీవల హైదరాబాద్‌ టి-సేఫ్ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు బయట పడింది. కనుక దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో వెంటనే స్పందించి ఏడాదిపాటు నిషేధం విధించింది.

ఇక నుంచి ఈ కృత్రిమ పన్నీరు విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఫుడ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అయితే ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలతో తయారుచేసి చట్టబద్ధంగా విక్రయిస్తున్న సంస్థలు, వాటి పన్నీర్, సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

Related Post