తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నోటీసులు అందుకున్నవారిలో ప్రముఖ నటులు మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, సమంత, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తదితరులు ఉన్నారు.
క్రీడా రంగానికి చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కూడా ఈసీ నోటీసులు పంపింది.
వ్యాపార రంగానికి చెందిన మురళీకృష్ణ ప్రసాద్ దివి, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఓటర్ల జాబితాలోని వివరాలు, గతంలో నమోదైన రికార్డుల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం చేపట్టిన పరిశీలనలో పలువురి వివరాలు మ్యాచ్ కాకపోవడం, తండ్రి పేర్లలో తేడాలు ఉండటం, గత రికార్డులతో ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలపై వివరణ ఇవ్వడంతో పాటు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
అయితే వీరంతా బిజీగా ఉండే ప్రముఖులు కావడంతో.. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని వారికి అధికారులు వెసులుబాటు కల్పించారు. తమ తరఫున ప్రతినిధిని పంపించి అవసరమైన పత్రాలు, వివరణలను సమర్పించే అవకాశం ఇచ్చారు.