అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునే అలవాటు లేదనే చెప్పాలి. అయితే ఇరాన్‌తో యుద్ధం చేస్తూ బిజీబిజీగా ఉంటారు లేకుంటే సుంకాలు, హెచ్-1 బీ వీసాలతో బిజీబిజీగా ఉంటారు.
ఇరాన్‌లో మొదలు పెట్టిన ‘వీకెండ్ పిక్నిక్’ ఇంకా ముగియక మునుపే మళ్ళీ హెచ్-1 బీ వీసాలపై దృష్టి పెట్టారు. తాజాగా ఈ వీసాలలో 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును తొలగించబోతున్నారు. దీని కోసం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదన చేసి, ప్రజాభిప్రాయం స్వీకరిస్తోంది.
హెచ్-1 బీపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కొని ఆ ప్రాంతానికి షిఫ్ట్ అవడానికి వీలుగా ఈ 60 రోజులు వెసులుబాటు ఉండేది. ట్రంప్ సర్కార్ దానిని ఎత్తివేయాలనుకుంటోంది.
అంటే ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ఉద్యోగం పోగానే మరో ఉద్యోగంలోకి మారే అవకాశం ఉండదు. తక్షణం మూటాముల్లె సర్దుకొని స్వదేశానికి పోవాల్సిందే. కనుక ఈ ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా పడుతుంది. ఈ నిబంధన అమలులోకి వస్తే, హెచ్-1 బీ వీసాలతో పాటు ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్-1బీ1, టిఎన్, ఎల్-1, ఓ-1 వీసాలపై అమెరికాలో ఉంటున్నవారిపై కూడా ప్రభావం పడుతుంది.
ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ ప్రతిపాదనపై రెండు నెలలపాటు ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుంది. దానిని బట్టి తుది నిర్ణయం తీసుకుంతుంది.
దీని వలన విదేశీయులు మాత్రమే కాకుండా అమెరికా కంపెనీలపై కూడా పెనుభారం పడుతుంది. కనుక మళ్ళీ అమెరికా సుప్రీంకోర్టు కలుగజేసుకొని బ్రేకులు వేయక తప్పదేమో?