ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా (57) ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి ముంబాయిలోని తన ఇంట్లోని బాత్రూంలో జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలైయ్యాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మర్నాడు ఉదయం వరకు ఎవరికీ ఈ విషయం తెలియలేదు. దీంతో మెదడులో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడే చనిపోయారు.
సంజయ్ గుప్తా 1994లో ‘ఆతిష్’ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ముంబై అండర్‌వరల్డ్, క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో ఆయనది చాలా ప్రత్యేక శైలి.
‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’, ‘కాబిల్’, ‘జజ్బా’, ‘ముంబై సాగా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన చివరి సినిమా రెండేళ్ల క్రితం తీసిన ‘ది మిరిండా బ్రదర్స్’.
సంజయ్ గుప్తా మరణవార్తను ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.