హైడ్రా అంటే నగరంలో పేదల ఇళ్ళు కూల్చివేసే ఒక చెడు సంస్థ అనే అభిప్రాయం బలంగా ఉంది. ఎందుకంటే అందరికీ దాని కూల్చివేతలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీకి గల రాజకీయ శత్రుత్వం కారణంగా వాటినే హైలైట్ చేసి నిందిస్తోంది కనుక.
కానీ నగరంలో వేలకోట్లు విలువగల ప్రభుత్వ భూములను కాపాడిందని, అనేక చెరువులలో పూడికలు తీసి పునరుద్దరిస్తోందనే మంచి విషయాలను చాలా మంది పట్టించుకోవడం లేదు.
అటువంటి వాటిల్లో మాదాపూర్ వద్ద గల సున్నం చెరువు కూడా ఒకటి. దానిలో 10-15 అడుగుల మేర పూడికను తొలగించి, చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఆ చెరువు చుట్టూ వాక్ వే, పిల్లల ప్లే ఏరియాలు, పచ్చటి మొక్కలు పెంచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆ చెరువులోకి వర్షం నీరు ప్రవహించే కాలువలను క్లియర్ చేసింది. దీంతో బీడువారిన సున్నం చెరువులోకి ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్ళు చేరుతున్నాయి.
సున్నం చెరువులో పూడిక తొలగించినందున ముందుగా వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతుంది. మళ్ళీ వర్షాలు పడితే ఇంకా నీళ్ళు ఇంకుతాయి. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇటీవల సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమ బోర్లను హైడ్రా తొలగించింది. కనుక చెరువులో నీరు కూడా ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంటుంది.
మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిస్థితి కూడా ఇదివరకు ఇలాగే ఉండేది. దానిని హైడ్రా అభివృద్ధి చేయడం ఈ చెరువులోకి కూడా వర్షం నీరు వచ్చి చేరుతోంది. సుందరీకరణ పనులు పూర్తయిన తమ్మిడుకుంట, సున్నం చెరువులను త్వరలో సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.