మల్లన్నసాగర్ కూడా కూల్చేద్దామనుకుంటున్నారా? హరీష్‌

October 30, 2026


img

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు నేడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిశీలనకు వెళ్ళారు. ఈ సందర్భంగా తిప్పారం గ్రామ్ సర్పంచ్ భద్రప్ప, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

మల్లన్న సాగర్‌కు అతిసమీపంలో గత కొన్ని వారాలుగా బండరాళ్ళను జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుస్తున్నారని వారు చెప్పారు. 

ఆ ప్రేలుళ్ళ ధాటికి కిమీ దూరంలో ఉన్న తమ ఊర్లో ఇళ్ళ గోడలు బీటలు వారుతున్నాయని, మట్టి పెళ్ళలు విరిగిపడుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. అక్కడ ప్రేలుళ్ళు జరిపేందుకు అనుమతించాలంటూ తనపై చాలా ఒత్తిడి తెచ్చారని కానీ తాను అంగీకరించలేకని సర్పంచ్ భద్రప్ప చెప్పారు. 

మల్లన్న సాగర్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులను, అక్కడ బండరాళ్ళను ప్రేలుస్తున్న కాంట్రాక్టర్‌ను హరీష్‌ రావు అక్కడకు రప్పించి వారినీ గట్టిగా నిలదీశారు. 

రిజర్వాయర్ గోడ 40 మీటర్ల ఎత్తు ఉన్నందున నిబంధనల ప్రకారం దానికి 10 రెట్లు అంటే 400 మీటర్లలోపు ఎటువంటి ప్రేలుళ్ళు జరుపరాదనే విషయం మీకు తెలుసా లేదా? అంటూ వారిని నిలదీశారు. 

రిజర్వాయర్ గోడకు 100-150 మీటర్ల దూరంలోనే ప్రేలుళ్ళు జరిపేందుకు మీకు ఎవరు అనుమతించారని హరీష్‌ రావు నిలదీశారు. 

ఇదివరకే మేడిగడ్డ బారాజ్‌ ఇటువంటి కారణంగానే దెబ్బ తిందని, ఇప్పుడు మల్లన్న సాగర్‌ను కూడా దెబ్బ తీస్తారా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది చుట్టుపక్కల 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టుకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారిని నిలదీశారు. 

హరీష్‌ రావు అక్కడి నుంచి కారులో తిరిగి వెళుతున్న సమయంలో దారిలో ఓ గొర్రెల కాపరి ఎదురైతే, కారు దిగి అతనితో కూడా ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. 

అతను మరో దిగ్బ్రాంతి కలిగించే విషయం చెప్పాడు. ఈ ప్రేలుళ్ళ ధాటికి మల్లన్న సాగర్ గోడలకు కూడా బీటలు పడి వాటి నుంచి బయటకు నీళ్ళు కారుతున్నాయని చెప్పాడు. ఇదివరకు తన గొర్రెలు త్రాగేందుకు చుట్టుపక్కల నీళ్ళు దొరికేవి కావని ఇప్పుడు నీళ్ళు లీక్ అవుతుండటంతో ఎక్కడికక్కడ దొరుకుతున్నాయని చెప్పారు. 


Related Post