కేసీఆర్‌ కాజేయబోతే అడ్డుకున్నా: సిఎం రేవంత్‌

October 30, 2026


img

హైదరాబాద్‌, మియాపూర్‌లోని సుమారు రూ. 50,000 కోట్లు విలువైన 550 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌ రెడ్డి దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ,మీడియా సమావేశంలో మాట్లాడారు. “బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం, వారి అనుచరులు తెలంగాణలో వేలాది ఎకరాలు కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు వారి నుంచి సుమారు లక్షన్నర కోట్ల విలువైన ప్రభుత్వ భూములను మేము కాపాడాము. 

మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను గతంలో తారుమారు చేసి, కల్వకుంట్ల కుటుంబం, వారి అనుచరులు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. 

మంచిరేవుల పరిధిలోని మరో 143 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేటీఆర్‌ ప్రయత్నించారు. సుదీర్గ న్యాయపోరాటం చేసి ఆ భూములను స్వాధీనం చేసుకున్నాము. అందులో 50 ఎకరాలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు కేటాయించాము. ప్రస్తుతం ఐఎంజీ భూముల వ్యవహారంలో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో బలంగా వాదిస్తున్నాము. .

మియాపూర్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించాను. అవసరమైతే వాటిని అమ్మి ప్రభుత్వం విద్యావ్యవస్థల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, ఇందిరమ్మ ఇళ్ళు, సంక్షేమ పధకాల కోసం వినియోగిస్తాము. 

ఎర్రవల్లి, శేరి వెంకటాపూర్‌ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్‌ 325లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే జరిపిస్తున్నాము. ఆ భూములను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాము. బీఆర్ఎస్‌ పార్టీ హయంలో రాష్ట్రంలో జరిగిన భూకబ్జాలపై విచారణ కొనసాగుతోంది. కనుక ఇకనైనా కేసీఆర్‌ తన అనుచరులకు భూకబ్జాలు మానుకుంటే మంచిది,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 


Related Post