అర్నబ్ తుఫాన్ పొరుగు రాష్ట్రంఆంధ్రపై విరుచుకుపడింది. నాటి హూద్ హూద్ తుఫానును తలపించేలా పలు జిల్లాలలో విధ్వంసం సృష్టించింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నుంచి ఇటు కోనసీమ జిల్లా వరకు అర్నబ్ తుఫాన్ భీభత్సం సృష్టించింది.
వందలాది భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ అంధకారంలో భయంకరమైన ఈదురుగాలులతో కుండపోత వాన కురుస్తుంటే ప్రజలు రాత్రంతా నిద్రపోకుండా భయాందోళనలతో గడిపారు.
ఏపీలో పలు ప్రాంతాలకు వెళ్ళాల్సిన రైళ్ళతో పాటు ఏపీ మీదుగా ప్రయాణించే వందకు పైగా రైళ్ళు రద్దు అయ్యాయి. గన్నవరం (విజయవాడ), భోగాపురం (విశాఖ)కు పలు విమానాలు రద్దు అయ్యాయి. ఓ పక్క కుండపోతగా వాన, మరోపక్క వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాలలో అరటి తోటలు దెబ్బ తిన్నాయి.
ఈ రోజు తెల్లవారుజామున నరసాపురానికి సమీపంలో తుఫాను తీరం దాటి క్రమంగా బలహీనపడుతోంది. ఈరోజు సాయంత్రంకల్లా తుఫాను తీవ్రత, వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.