రష్యా-ఉక్రెయిన్ యుద్ధభూమిలో తెలంగాణ యువకులు!

September 30, 2026
img

రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన భుక్యా రవీందర్, భుక్యా అశోక్, మేగావత్ ప్రకాష్, మహ్మద్ అఫ్జల్‌ఖాన్‌ నలుగురు రష్యా నుంచి తమ కుటుంబ సభ్యులకు పంపిన ఆడియో, వీడియో సందేశాలతో ఈ విషయం బయటపడింది. 

రష్యన్స్ ఇళ్ళలో పనులు ఇప్పిస్తామని, ఒక్కొక్కరికీ నెలకు రెండు లక్షల వరకు జీతం లభిస్తుందని ఏజెంట్లు నమ్మబలికారు. ఇందుకోసం ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ రష్యా వెళ్లిన తర్వాత వారిని సైనిక శిబిరానికి తీసుకెళ్లి, సైనిక దుస్తులు ధరింపజేసి, చేతికి తుపాకులు ఇచ్చి ఉక్రెయిన్ దళాలతో యుద్ధం చేయాలని చెప్పారని ఆ నలుగురు యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తెలిపారు. 

ప్రస్తుతం తాము ఉక్రెయిన్‌కు సమీపంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారని వారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. 

ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల ద్వారా ముఖ్యమంత్రిని నేరుగా కలిసి మొర పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పూనుకొని కేంద్ర విదేశాంగ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకు రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వాధికారులు ఆ ఏజంట్ వివరాలు, నలుగురు యువకుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

Related Post