తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలో ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం అమలైతే పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలులోకి వస్తుంది.
ఈ కమిటీలో ఆర్థిక, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులతో పాటు సీపీఎస్ ఉద్యోగుల ప్రతినిధులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమేనా? అలా చేస్తే ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
దేశవ్యాప్తంగా 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే అంతకు ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనా, నియామకాలు ఆలస్యం కావడంతో కొందరు ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కూడా సుమారు 10 వేల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నట్లు అంచనా. వీరి సమస్యలను కూడా అధ్యయన కమిటీ పరిశీలించే అవకాశం ఉంది.