జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

November 17, 2026


img

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్లలో జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆర్ అండ్ బీ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు... ఇలా ఏ శాఖలో చూసినా అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారని ఆరోపించారు. 

కాంట్రాక్టర్ల నుంచి 10-20 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, దీంతో అధికారులు అడిగే కమీషన్లు చెల్లించలేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.

ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి మరింత ఎక్కువగా ఉందని, అక్కడి అధికారులు రోజుకు రూ.1-2 లక్షలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

జడ్చర్లలో తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. తాను ఓ వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులకు సిఫార్సు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. కానీ ఆ వ్యక్తి అధికారులకు రూ.15,000 లంచం ఇవ్వడంతో వారు ఆయనకే ఈ ఆ కాంట్రాక్ట్ ఇచ్చారని అనిరుద్ రెడ్డి చెప్పారు.

అవినీతి ఇంతగా విస్తరించడంతో ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 

కనుక ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులను జర్నలిస్టులు బయటపెట్టాలని అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. 

అవినీతి అధికారులపై వార్తలు రాయడానికి జర్నలిస్టులు వెనుకాడవద్దని, వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సంబంధిత అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తానని స్పష్టం చేశారు.

(Video source: Telugu Scribe)

Related Post