బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ వంటి అనుబంధ సంస్థలు ఉన్నాయని, ఇప్పుడు నాలుగో అనుబంధ సంస్థగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సైన్యం అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారని ఆరోపించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కవిత చేస్తున్న వాదనలు, విమర్శలు కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్‌లో భాగమేనని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన కవిత జియాలజిస్ట్లా మారి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భూకంప ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించారంటూ ఇప్పుడు విమర్శలు చేస్తున్న కవితకు.. నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ విషయం తెలియదా? ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టారనే సంగతి తెలియదా? అని ప్రశ్నించారు.
కవితకు ప్రవీణ్ కుమార్ మరో సూటి ప్రశ్న సంధించారు. “నేను ఐపీఎస్ అధికారిగా పనిచేసిన అనుభవంతో అడుగుతున్నాను. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తయారు చేసిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీ చేతికి ఇచ్చి ఈ విధంగా మాట్లాడమని చెప్పారా? లేకపోతే ఆ నివేదిక మీ చేతికి ఎలా వచ్చిందో చెప్పగలరా?” అని ప్రశ్నించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.