ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (81)శనివారం ఉదయం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయన వృధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు.
ఒకప్పుడు విలన్ పాత్రలు ఎక్కువగా చేసిన అయన ఆ తర్వాత జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలతో సహా అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశారు. ఒకప్పుడు అయన విలనిజం, మ్యానరిజం చాలా ఫేమస్. కనుక తెలుగు సినీ ప్రేక్షకులకు గిరిబాబు పరిచయమే అవసరం లేని వ్యక్తి.
ఆయన ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయనకు చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు చేశారు. 1973లో విడుదలైన 'జగమే మాయ' సినిమాతో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
ప్రారంభంలో హీరోగా నటించిన గిరిబాబు ఆ తర్వాత విలన్గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 600కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు: అన్నదమ్ముల అనుబంధం (1975), జ్యోతి (1976), కురుక్షేత్రం (1977), దేవతలారా దీవించండి (1977), కరుణామయుడు (1978), మల్లెపూవు (1978), సింహ గర్జన (1978), హేమాహేమీలు, సింహాసనం (1986), ఖైదీ రుద్రయ్య (1986), జయం మనదే (1986), పసివాడి ప్రాణం (1987), అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989), హలో బ్రదర్ (1994), భైరవ ద్వీపం (1994), నిన్నే పెళ్ళాడతా (1996) వంటివి అనేకం ఉన్నాయి.
గిరిబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మెరుపు దాడి’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ వంటి సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు.
గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో మరణించారు. వారికి ఇద్దరి కుమారులలో ‘రఘుబాబు’ తండ్రి బాటలోనే సాగుతూ విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు.