నాడు రామాయణ, మహాభారత కాలం నుంచి నేటి వరకు పరస్త్రీ వ్యామోహం కొంపలు ముంచుతూనే ఉంది. భారత్ వాయుసేనలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి పాకిస్థాన్ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారు. పాకిస్థాన్ గూఢచార విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ మహిళ వలలో పడ్డారు. ఆమె నగ్న ఫొటోలు పంపిస్తే, ఒక్కో ఫొటోకు బదులుగా వాయుసేన యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు ఎక్కడెక్కడ మోహరించి ఉన్నాయో సమాచారం అందజేశారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు సదరు అధికారిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు వాట్సాప్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళతో సంభాషణలు జరిపారు. ఆమె నగ్న ఫొటోలకు ప్రతిగా యుద్ధ ప్రణాళికలోని అత్యంత రహస్యమైన పేజీలను పంపారు.
అంతేకాదు.. దేశంలోని రహస్య డ్రోన్ విభాగం బలం, దాని సామర్థ్యాలు, డ్రోన్ పరీక్షలు, యుద్ధ సమయంలో వాటి మోహరింపు ప్రాంతాల వివరాలను కూడా వెల్లడించినట్లు పోలీసులు ఆరోపించారు.
ముఖ్యంగా లేహ్‌లో యుద్ధ విమానాల మోహరింపు, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం చేరవేసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానిత మహిళ పంపిన మాల్‌వేర్, స్పైవేర్ యాప్‌లను తన కింద పనిచేసే ఐదుగురు సిబ్బంది పరికరాల్లో ఇన్‌స్టాల్ చేయడానికి కూడా అధికారి ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. దీనివల్ల ఇతర సైనిక సిబ్బంది సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
సదరు అధికారి, అనుమానిత మహిళ మధ్య వాట్సాప్‌లో 3,008 టెక్స్ట్ మెసేజ్‌లు, 65 ఫొటోలు, 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్ జరిగినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి, వింగ్ కమాండర్‌ను మే 30న అరెస్టు చేశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు పొక్కి వైరల్ అయింది.