ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆయన కాన్వాయ్ వెనకే వస్తోంది.
దానిలో ఓ కారును వెనుక నుంచి వచ్ఓచిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఆ ధాటికి ఆ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. కొన్ని క్షణాల ముందే తీన్మార్ మల్లన్న కారులో నుంచి దిగి పాదయాత్ర మొదలుపెట్టడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
కానీ ఆ కారు నడుపుతున్న డ్రైవర్, ఎదురుగా వస్తున్న కారులోని మేడబోయిన శ్రీనాథ్, అయన భార్య చందన, వారి రెండేళ్ళ కుమారుడు, వారి కారు డ్రైవర్ సురేష్ ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తీన్మార్ మల్లన్న వెంటనే స్పందిస్తూ వేరే కారులో వారిని సమీపంలోని ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో అయన కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన లారీని, రెండు కార్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.