హైదరాబాద్‌లో భారత్ సదస్సు-2026 జరుగబోతోంది. దీనిలో తెలంగాణ గొప్పతనాన్ని, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ప్రపంచ దేశాలకు తెలియజేయలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఆయనను అడ్డుకుంటామని బిజేపి ఎందుకు బెదిరిస్తోంది? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం, “కిషన్‌రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ కాస్త విజ్ఞత ప్రదర్శించాలన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వల్లనే ఓడిపోయినందున వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన వలన ఓడిపోతామనే భయం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పట్టుకుందన్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే ప్రతిపక్షాలు స్వాగతించాలి. కానీ అడ్డుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గామన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారని, కానీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండింటివి ఇంచుమించు ఒకే రకమైన విధానాలని అందుకే భారత్ సదస్సుపై దుష్ప్రచారం చేస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు.