తెలంగాణలో ఇంటర్మీడియట్ విధానానికి స్వస్తి పలికి, వచ్చే విద్యా సంవత్సరం (2027–28) నుంచి 10+2 విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, 11, 12 తరగతులను పాఠశాల విద్యాశాఖలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిజానికి ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమలు చేయాలని భావించింది. కానీ ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి మార్పులు చేస్తే విద్యార్ధులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక ఈ ప్రతిపాదనను వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేసింది.
ఈ మార్పుతో విద్యార్థులు పదో తరగతి తర్వాత ప్రత్యేకంగా జూనియర్ కాలేజీల్లో చేరాల్సిన అవసరం ఉండదు. పాఠశాల విద్యలోనే 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది.
కొత్త విధానంలో విద్యా వ్యవస్థను మూడు విభాగాలుగా విభజించనున్నారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్య, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్య, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా కొనసాగించనున్నారు.
పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న విద్యార్థుల సంఖ్యను తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలని భావిస్తోంది.
మరోవైపు ఈ విధానం అమలుతో జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది ఉద్యోగాలకు, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త విధానం అమలుకు అవసరమైన ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేయనున్నారు.