యూనివర్సిటీ వీసీపై విచారణకు గవర్నర్ ఆదేశాలు!

November 12, 2026


img

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరపాలని తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా అధికారులను ఆదేశించారు.

యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ముసిని తేజశ్రీ తన పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు గడువు పొడిగించాలని వీసీని కోరినప్పుడు ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, విదేశాల్లో పనిచేస్తున్న తన భర్తను వదిలేయాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఆయన కోరికకు అంగీకరించకపోవడంతో తనను నిజామాబాద్‌కు బదిలీ చేశారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఆమె రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు, మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా కమిషన్‌ కూడా స్పందించి, నవంబర్‌ 12న విచారణకు హాజరుకావాలని వీసీ జానయ్యకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు, వీసీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు, ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను వీసీ అల్దాస్‌ జానయ్య ఖండించారు. సాధారణ బదిలీలను వ్యతిరేకిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కూడా డీజీపీకి లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ కూడా విచారణకు ఆదేశించడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలితేనే ఈ ఆరోపణల్లో వాస్తవాలేమిటో స్పష్టమవుతుంది.  


Related Post