ఏపీలో కొత్త పార్టీ: పేరు పరివర్తన రాజనీతి పార్టీ

November 11, 2026


img

తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందంటూ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ స్థాపించినట్లే, మన పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా ఎప్పటికీ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని, ప్రజలను పాలించాలా? వారి వారసులే ముఖ్యమంత్రి పదవులు చేపట్టాలా? అని ప్రశ్నిస్తూ మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు విజయవాడలో తన కొత్త పార్టీ పేరు పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అని ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు.  కాషాయం, తెలుపు రంగులు కలిగి మధ్యలో ధర్మచక్రంతో జెండా ఉంది. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే మోజుతో ఈ పార్టీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారిలో నుంచి నాయకులను తయారుచేసి వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే నా లక్ష్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విర్రవీగుతూ పార్టీని ముంచేసుకుంటే, చంద్రబాబు నాయుడు ఎంతసేపు కులం, అర్ధ బలం, మంద బలంతో గొప్పలు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తూ ఏపీని భ్రష్టు పట్టించేస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.  

తాను ఎవరు వదిలిన బాణం కాదని, ఏపీ ‘రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు’తెస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని జగన్‌, చంద్రబాబు కుటుంబాల చెర నుంచి విముక్తి కల్పించి, అధికారం ప్రజలకు అప్పగించేందుకే తాను ఈ పీఆర్‌పీతో వచ్చానని విజయసాయి రెడ్డి చెప్పుకున్నారు.  


Related Post