నల్గొండ జిల్లాకు చెందిన శ్రీజ రెడ్డి కోయ (23) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఆమె బోస్టన్‌లోని డార్చెస్టర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
నవంబర్ 2వ తేదీ రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో తన నివాసం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో బోస్టన్ పోలీసులు నవంబర్ 4న మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేశారు.అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు.
కానీ వారం రోజులైనా ఆమె ఆచూకి కనుగొనలేకపోయారు. ఒక్కగానొక్క కూతురు శ్రీజ ఆచూకీ లభించకపోవడంతో తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీజ చివరి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కానీ ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. కనుక ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది.
శ్రీజ స్వస్థలం నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లాపురం. ఆమె తల్లిదండ్రులు యాదగిరి రెడ్డి, రూప తమ ఏకైక కుమార్తె క్షేమంగా ఉందనే సమాచారం కొరకు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శ్రీజను గుర్తించేందుకు సహాయం చేయాలని బోస్టన్‌లోని భారత కాన్సులేట్, కేంద్ర విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఆమెను సురక్షితంగా తీసుకువచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.