అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ‘సిల్వర్ రైల్ ఎలిమెంటరీ’ పాఠశాలలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో ఓ ఏడేళ్ల చిన్నారి, మరో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడు కూడా ఎదురు కాల్పులలో మృతి చెందాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు తొలుత పాఠశాల వెలుపల ఉన్న ఓ కారుపై కాల్పులు జరిపాడు. అనంతరం పాఠశాల లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కానీ అప్పటికే పాఠశాల భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పులలో గాయపడి నిందితుడు కూడా మృతి చెందిన్నట్లు గుర్తించారు.
ఈ కిండర్గార్టెన్ పాఠశాలలో 5 నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు, 40 మంది సిబ్బంది ఉన్నారు. గాయపడిన విద్యార్ధిని, ఉపాధ్యాయుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి వివరాలు, ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్ధులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.