ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంటే 2008లో జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల వివాదంపై ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది.
జీవో నంబర్ 28 సవరణను సవాల్ చేస్తూ నాడు బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన మూడు రిట్ పిటిషన్లను హైకోర్టు నేడు కొట్టివేసింది. దీంతో ఈ నియామకాలకు సంబంధించి ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయవివాదం కొలిక్కి వచ్చినట్లయింది.
ఇంతకీ వివాదం ఏమిటంటే, నాటి ప్రభుత్వం 2008 డిసెంబర్‌లో 52,655 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 30,558 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు ఉన్నాయి.
తొలుత ఈ పోస్టులకు బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పోటీపడేందుకు అవకాశం కల్పించారు. అయితే, ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 2009 జనవరి 29న ప్రభుత్వం మరో జీవో (నంబర్ 28) జారీ చేసింది.
దీని ప్రకారం ఎస్‌జీటీ పోస్టుల్లో 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. మిగిలిన 70 శాతం పోస్టులకు మాత్రమే బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పోటీపడేలా నిబంధనలు రూపొందించింది.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిబంధనలను మార్చడం సరికాదంటూ బీఈడీ అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు కూడా ఏర్పాటయ్యాయి. ఆవిధంగా ఈ కేసులు తెలంగాణ హైకోర్టుకు రాగా వాటిపై ఇన్నేళ్ళ విచారణ తర్వాత ధర్మాసనం మూడు రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ నేడు తీర్పు ఇచ్చింది.
దీంతో డీఎస్సీ-2008 నియామకాలపై న్యాయపోరాటం ముగిసినట్లే భావించవచ్చు.. మళ్ళీ ఎవరూ సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా ఉంటే!