విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే నిరుద్యోగ యువత నేటికీ అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. అటువంటివారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
ఇందుకోసం ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్’ను ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, వీసా, విమాన ప్రయాణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది.
ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 19 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో పథకం అమలవుతుంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలిదశలో 7 వేల మందికి సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 5,880 మందికి నేరుగా విదేశీ ఉద్యోగాలకు వెళ్లేందుకు, మరో 1,120 మందికి విదేశీ భాషల శిక్షణ కోసం ఆర్థిక సాయం అందించనుంది.
ఈ పథకంలో రెండు కేటగిరీలు ఉన్నాయి. విదేశీ భాషల శిక్షణ అవసరం లేకుండా ఉద్యోగాలకు వెళ్లేవారికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీలో గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇందులో భాషా శిక్షణ, వీసా, ప్రయాణ ఖర్చులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని అభ్యర్థులే సమకూర్చుకోవాలి. అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నారు.
నిర్మాణం, తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.
వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. తెలంగాణకు చెందినవారై ఉండటంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారై ఉండాలి. సంబంధిత వృత్తిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
దీని కోసం అర్హులైన అభ్యర్థులు టామ్‌కామ్ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించరు. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హతలు, పని అనుభవానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి.
దరఖాస్తుల పరిశీలన అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. మహిళలకు కనీసం 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం అవకాశాలు కేటాయించారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోకుండా ప్రభుత్వ మార్గదర్శకాల్లో సూచించిన విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.