తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వర్షాకాల సమావేశాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే నెల శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
ఈ సమావేశాలలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి, తాగు, సాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు కూడా కృష్ణా, గోదావరి జలాలు ఎత్తిపోయకుండా దిగువకు వదిలేస్తుండటంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ఖాయం.
అలాగే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ దిగువ నుంచి నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ‘పల్నాడు వాటర్ గ్రిడ్’పై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కనుక ఈ శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు ఈ అంశంపై గట్టిగా నిలదీయడం ఖాయం.
ఇక కాంగ్రెస్-బిజేపిల మధ్య ‘సర్’ పేరుతో లక్షలాది ఓట్లు తొలగింపు అంశంపై వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
ఇవికాక ప్రభుత్వం ఈ సమావేశాలలో కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనుంది. అయితే కేవలం 3-5 రోజులు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.