కాంగ్రెస్‌ నిస్సహాయత రాజగోపాల్ రెడ్డికి తెలుసు అందుకే...

November 25, 2026


img

 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇద్దరూ సీఎం రేవంత్‌ రెడ్డిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కనుక వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నట్లు సీఎం రేవంత్‌ కూడా సూచనప్రాయంగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బిఎం.సందీప్ మంగళవారం రాత్రి ప్రజా భవన్‌లో వారిరువురితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పాల్గొన్నారు.            

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తనతో లేదా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడుని కలిసి మాట్లాడాలి కానీ బహిరంగంగా మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అయితే వారిరువురూ తమ నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని, పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. 

రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదనే విషయం మరోసారి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌కు గుర్తుచేశారు. 

నియోజకవర్గాలకు నిధుల విడుదల, మంత్రి పదవి, ఇతర సమస్యల గురించి తాను సీఎం రేవంత్‌ రెడ్డితో, కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడి పరిష్కరిస్తానని సందీప్ హామీ ఇచ్చారు. కానీ మరోసారి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరించారు. 

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో రగిలిపోతూ అవకాశం చిక్కినప్పుడల్లా బహిరంగ వేదికలపై సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ కారణంగా అయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదు. పంటి కింద రాయిలా మారిన రాజగోపాల్ రెడ్డిని తొలగించుకోవాలనే కోరుకుంటారు తప్ప తెచ్చి పక్కన పెట్టుకోవాలనుకోరు కదా?

కానీ నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న ఆయనను వదులుకుంటే జిల్లాలో కాంగ్రెస్‌ బలహీనపడుతుందనే ఆలోచనే ఆ పార్టీ నిస్సహాయతకు కారణంగా కనిపిస్తోంది. ఈ నిస్సహాయత గురించి రాజగోపాల్ రెడ్డికి కూడా బాగా తెలుసు.

కనుక ఎన్నిసార్లు హెచ్చరించినా షోకాజ్ నోటీసులు ఇచ్చినా తగ్గేదేలే అంటున్నారు. మరి సీఎం రేవంత్‌ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి ఆమోదయోగ్యంగా ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమేనా?


Related Post