మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి, “అదృష్టం బాగుంది సీఎం అయ్యావ్.. ఎవడిని పడితే వాడిని తొక్కేస్తానంటే కుదరదు. నువ్వు తొక్కితే తొక్కించుకునేలా నేను కనిపిస్తున్నానా? అధికారం ఉందని ఏం చేసినా నడుస్తుందనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం మొదలవుతుంది,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అలాగే మూడేళ్ళ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ప్రభుత్వ పనితీరును కూడా తప్పు పట్టారు. ఈవిధంగా హద్దులు దాటి మాట్లాడినందుకు తనపై వేటు పడే అవకాశం ఉంటుందని ఆయనకు తెలియదనుకోలేము. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా రాజకీయ నాయకులు వేటు వేయించుకుని బయట పడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. తద్వారా తనకు అవమానం, అన్యాయం జరిగిందని ప్రజలకు చెప్పుకోవచ్చు. వారి సానుభూతి కూడా లభిస్తుంది. కనుక ఈ రాజీనామా వార్త కేవలం ఊహాగానమే అయ్యుండవచ్చు.
నిన్న సిద్ధిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఆయనను వెర్రికుక్క కరిచిందో ఏమో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకుపోయి జేరుస్తారు. చెడు మైకులో చెప్పి, మంచి చెవిలో చెప్పడం ఆయనకు పరిపాటిగా మారింది,” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
కనుక రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా చేయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇక ఎంత మాత్రం ఆయనను ఉపేక్షించకపోవచ్చు.