ఉత్తరాదిలో అత్యంత ప్రజాధరణ పొందిన హిందీ వెబ్ సిరీస్‌లలో ‘పంచాయత్’ కూడా ఒకటి. గ్రామీణ నేపథ్యంలో చక్కటి కామెడీ, గ్రామీణ రాజకీయాలు మానవ సంబంధాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు నాలుగు సీజన్లు రాగా అన్నిటికీ మంచి ఆదరణ లభించింది. తాజాగా పంచాయత్ 5వ సీజన్ డిసెంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది.
నగరంలో పుట్టి పెరిగిన అభిషేక్ త్రిపాఠి అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, ఉన్నత చదువులు చదువుతూ ఆలోగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతనికి ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వస్తుంది.
అయితే నగర జీవితానికి అలవాటు పడిన అభిషేక్‌కు పల్లెటూరి వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. గ్రామంలోని సమస్యలు, రాజకీయాలు, ప్రజలతో వ్యవహరించడం మొదట్లో అతనికి ఇబ్బందిగా మారతాయి. ఆ తర్వాత అక్కడి మనుషులతో ఏర్పడే పరిచయాలు, అనుబంధాలు కథను ఆసక్తికరంగా మారుస్తాయి.
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్ అభిషేక్ త్రిపాఠిగా నటించగా, నీనా గుప్తా మంజు దేవి పాత్రలో కనిపించారు. రఘుబీర్ యాదవ్ బ్రిజ్ భూషణ్ దూబేగా, ఫైసల్ మాలిక్ ప్రహ్లాద్ పాండేగా, చందన్ రాయ్ వికాస్‌గా నటించారు. సాన్వికా రింకీ పాత్రలో, దుర్గేశ్ కుమార్ భూషణ్ అలియాస్ బన్రాకస్ పాత్రలో ఆకట్టుకున్నారు. సునీతా రాజ్వార్ క్రాంతి దేవిగా నటించారు.