సాగర్‌కు బొక్క పెట్టి నీళ్ళు తీసుకుపోతున్న పట్టించుకోరా?

November 19, 2026


img

ఏపీ ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని 363 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది. దీని కోసం నాగార్జునసాగర్ నుంచి రోజుకు టీఎంసీలు నీటిని తీసుకునేందుకు వీలుగా పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేసుకుంటోందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం ఏడాదిగా సర్వే చేస్తోంది. దీని కోసం ఇటీవలే ఓ జీవో కూడా జారీ చేసింది. సాగర్ కింద బొక్క పెట్టి రోజుకు 2 టీఎంసీల నీళ్ళు తరలించుకుపోతే, రెండు నెలల్లోనే సాగర్‌లో నీళ్ళు   మొత్తం ఖాళీ అయిపోతాయి. అప్పుడు పక్కనే ఉన్న నల్గొండకు తాగునీరు, సాగునీరు మిగలదు.

హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందదు. అప్పుడు ప్రజలు వలసలు పోవాల్సి వస్తుంది. ఇలా ప్రతీసారి మేము ముల్లుకర్రతో పొడిస్తే తప్ప ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిద్ర లేవదా?మన నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇంత జరుగుతుంటే మొద్దునిద్రపోతున్నారు.

ఇప్పటికైనా ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును తక్షణం ఆపించాలి లేకుంటే బీఆర్ఎస్‌ పార్టీ ఉద్యమించ వలసి వస్తుంది,” అని హరీష్‌ రావు హెచ్చరించారు. 

 

 

(Video Source: Telugu Scribe)

Related Post