బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్కొన్న పథకాలలో ‘ధరణి పోర్టల్’ కూడా ఒకటి.
దీనిని ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు నెలలకు పైగా స్థిరాస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేశారు.
అయితే ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ, పేదల భూములను కొల్లగొట్టారని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ హయాంలో ధరణి ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ, ఆర్థిక అక్రమాలపై సీఐడీ విచారణకు కూడా ఆదేశించారు.
సీఐడీ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ధరణి పోర్టల్ ఆపరేటర్లు, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత భూములు, అసైన్డ్ భూములు, విలువైన ప్రభుత్వ భూముల రికార్డులను అక్రమంగా మార్చినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. సెక్షన్ 22-ఏ పరిధిలోని భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మార్చిన వ్యవహారంపైనా సీఐడీ అధికారులు దృష్టి సారించారు.
ఫోరెన్సిక్ ఆడిట్లో 10 వేలకు పైగా అనుమానాస్పద భూ లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో ఈ కేసును సీఐడీ మరింత లోతుగా పరిశీలిస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, ఆ పార్టీ ముఖ్యనేత హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ప్రాంతాల్లో దర్యాప్తు ప్రారంభించి, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.
ధరణి పోర్టల్‌లో లాగిన్ అయి రికార్డులు మార్చిన ఆపరేటర్లు, వాటి ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు, ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న రెవెన్యూ శాఖ అధికారుల వివరాలను సేకరిస్తున్నారు.
ఈ అక్రమ లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ, కోర్టులో నిరూపించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నారు.
అయితే ఇప్పటికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులపై లోతుగా విచారణ జరిపినప్పటికీ, ఈ కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అగ్రనేతలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.
కనుక కంప్యూటర్, రెవెన్యూ రికార్డులతో ముడిపడిన సంక్లిష్టమైన ఈ ధరణి కేసుల్లో అసలు నిందితులను గుర్తించి, వారిపై నేరాలను నిరూపించడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా మరో రెండేళ్ల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ కేసులన్నీ అటకెక్కిపోవా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
కేసుల్లో ఆశించిన పురోగతి సాధించలేనప్పుడు, ఎన్ని అవినీతి, అక్రమాలను వెలికితీస్తే మాత్రం ఏం ప్రయోజనం? అని సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.