నగరంలో నిత్యం సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాస్ ధరలను భారీగా తగ్గించింది.
ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించి ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి పాస్ ధరను రూ.275కు తగ్గించారు. ఈ పాస్‌తో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకోవచ్చు.
అలాగే నెలవారీ ఉమ్మడి పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు.
తగ్గించిన కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అంటే దీపావళి రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే ఉమ్మడి పాస్ ధరలు తగ్గించినప్పటికీ ప్రయాణాలపై పరిమితులు విధించడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
కానీ అపరిమిత ప్రయాణాలకు అనుమతిస్తే ఆర్టీసీ, మెట్రో సంస్థలకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక తాజా విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.