తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీల భారం పెరిగింది. ఈ నెల నుంచే పెంచిన ట్రూ-అప్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ట్రూ-అప్ ఛార్జీలో ఒక యూనిట్‌కు 30 పైసలు అదనంగా వసూలు చేస్తుండగా డిసెంబర్ నుంచి ఇది 50 పైసలకు పెరగనుంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు గతంలో విద్యుత్ కొనుగోలుకు అంచనా వేసిన ఖర్చు కంటే వాస్తవంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ వ్యత్యాసాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ట్రూ-అప్ ఛార్జీలను అమలు చేస్తున్నారు.
ఈ ఛార్జీలు 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్ ఆధారంగా ఉంటుంది. ఈ పెంపు కోసం విద్యుత్ సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదించింది. దీని ప్రకారం మొత్తం రూ.7,635.22 కోట్లు ఈవిధంగా నెలనెలా కొంత చొప్పున వసూలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
దీనిలో వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రూ.5,420.23 కోట్లు వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.