ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టబోతోంది. రూ.8,528 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్&డి) ఏర్పాటు చేయబోతోంది.
హ్యుందాయ్ ఇంజినీరింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యో చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసింది.
జహీరాబాద్లో ఏర్పాటు చేయనున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించి, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సిఎం రేవంత్ రెడ్డిని కోరారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,575 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు ద్వారా పరోక్షంగా కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
హ్యుందాయ్ ప్రతినిధుల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ప్రారంభానికి అవసరమైన సహకారం అందిస్తామని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, కనుక రాష్ట్రంలో హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉన్నందున వాహన తయారీ పరిశ్రమకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.
ఇటువంటి అంతర్జాతీయ కంపెనీ జహీరాబాద్లో ఏర్పాటు అయితే దానికి అనుబంధంగా ఆటోమొబైల్ రంగంలోని ఇంకా అనేక చిన్న పెద్ద పరిశ్రమలు కూడా తరలివస్తాయి. కనుక ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే తెలంగాణ పారిశ్రామిక రంగం పురోగతి మరింత వేగవంతం అవుతుంది.